బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టం చేయాలి
సిపిఎం నాయకుడు కారు ఉపేందర్
బిజెపి కపట నాటకాలకు ప్రజలు మోసపోవద్దు
నమస్తే ఇందూర్: కాజీపేట మండలం, అక్టోబర్ 17
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో చట్టబద్ధం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న “చలో రాజ్‌భవన్ ముట్టడి” కార్యక్రమానికి వెళ్లకుండా జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కమిటీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు కారు ఉపేందర్ మాట్లాడుతూ — “అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు. బీసీలకు న్యాయం కావాలంటే 42 శాతం రిజర్వేషన్ బిల్లును చట్టంగా చేయాలి. లేకపోతే రాష్ట్ర బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలి,” అన్నారు. బిజెపి నాయకులు రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో మరో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. “దేశానికి బీసీ ప్రధాని ఉన్నా, బిల్లును ఆమోదించకపోవడం విచారం. ఇది మనువాద పాలనకు నిదర్శనం,” అని అన్నారు. కేంద్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎంపీలు ప్రజలను మోసం చేస్తున్నారని, వారికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేసి బీసీ హక్కుల కోసం పోరాటం చేయాలని ఉపేందర్ డిమాండ్ చేశారు. రేపు జరగబోయే బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శులు దారుణ ప్రభాకర్, రాసాని గోపాల్, కురుకు రంజిత, లక్ష్మి, మల్లమ్మ, కావాట్టి కేత్తమ్మ, మధుకర్, జేజాలు చందర్ తదితరులు పాల్గొన్నారు.





