హనుమకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
విద్యాసంఘాలపై పోలీసుల దౌర్జన్యంపై వామపక్ష విద్యార్థి సంఘాల ఆగ్రహం
నమస్తే ఇందూర్: హనుమకొండ,
హనుమకొండ జిల్లా పరిధిలోని విద్యా రంగ సమస్యలను చర్చించేందుకు 20వ తేదీ మూడు గంటలకు వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్ సీసీ “అరగంటలో కలుస్తాం” అని చెప్పినప్పటికీ, సాయంత్రం 6 గంటలు దాటినా కూడా విద్యార్థి సంఘాలను కలవకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాలపై పోలీసులు అనవసరంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులను ఈడ్చిపడేసి, కొట్టి, అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు తెలిసింది. జిల్లాలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల ప్రయోజనాల కోసం కలెక్టర్ పోలీసులను ఉపయోగించి వామపక్ష విద్యార్థి సంఘాలపై దాడికి ప్రోత్సహించారని విద్యార్థి నాయకులు విమర్శించారు. విద్యార్థుల వినతిపత్రం కూడా స్వీకరించకపోవడం ప్రజాస్వామ్యంపై దెబ్బ అని పేర్కొన్నారు. “ప్రజాస్వామ్యం ఉన్న రాష్ట్రం అని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ… సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోవడం దారుణం. విద్యార్థులను అణచివేయడం ఎలా న్యాయం?” అని వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఘటనపై స్పందించకపోవడం చూసి ఇది వారి ఆశీర్వాదంతోనే జరిగిందని భావించే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. తక్షణ చర్యలు తీసుకోవాలి — విద్యార్థి సంఘాల డిమాండ్
వామపక్ష విద్యార్థి సంఘాలు హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను, సుబేదార్ పోలీసు స్టేషన్ సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, బంద్ కు పిలుపు ఇస్తామని హెచ్చరించాయి.





