హిందూ సంప్రదాయంతో సంక్రాంతి సంబురాలు
నమస్తే ఇందూర్,అమ్రాబాద్ మండలం రిపోర్టర్ జి.సరిత
అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలను సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు ఎన్. శంకర్ రాథోడ్ తెలిపారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఆయన మాట్లాడారు.ప్రస్తుత కాలంలో చిన్నారులకు పండుగల విశిష్టతను తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని, అందుకే పాఠశాల స్థాయిలోనే పండుగల సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించేటట్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిత్యం విద్యాబోధతో పాటు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహన పెరుగుతుందని తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గంగిరెద్దులు, హరిదాసుల నామస్మరణ, సంప్రదాయ వేషధారణలను విద్యార్థులు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించడంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. చిన్నారుల ప్రతిభను ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినులు విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శనలు చేసి అందరిని అలరించారు. విద్యార్థులు ధరించిన సంప్రదాయ వేషధారణ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి, ఉపసర్పంచి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





