NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:19 pm Posted by : MEDUDHULA KASHAGOUD

జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జూలై 03:విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు వంటి సమస్యలు విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్య హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని వారు కోరారు.
విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు:రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి.ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే సమగ్ర చట్టాన్ని తీసుకురావాలి. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి.ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.ఈ సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి జి. సురేష్, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్, ఏఐఎస్‌ఎఫ్ కామారెడ్డి ఏరియా అధ్యక్షుడు శివ, కార్యదర్శి సంపత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు నితిన్, ఏఐఎస్‌బీ జిల్లా నాయకుడు నిఖిల్ గౌడ్, రోహిత్, పీడీఎస్‌యూ జిల్లా నాయకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.