NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 3:12 pm Posted by : MEDUDHULA KASHAGOUD

నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం దృష్టి

నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం దృష్టి..

నామినేట్ పదవుల కోసం ఢిల్లీలో మకాం వేసిన నాయకులు

-పార్టీ పెద్దలతో సమాన్వయం చేసుకుంటున్న గడ్డం ఇందుప్రియ చంద్ర శేఖర్ రెడ్డి

నమస్తే ఇందూర్/ కామారెడ్డి ప్రతినిధి
జులై 29:

ఈ మధ్యే 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. ఆ సంస్థలకు చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు, ఇతర కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించడంతో ఎంపిక ప్రక్రియకు బ్రేకులు పడినట్లు తెలిసింది. పనితీరు ఆధారంగా కొందరికి రెండోసారి పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టగా, దానికి వ్యతిరేకంగా పీసీసీ కొత్త ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. పాతవారిని పక్కన పెట్టి, అన్ని సంస్థలకు కొత్తవారితో భర్తీ చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో పదవుల భర్తీపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విషయం హైకమాండ్ పరిధిలోకి వెళ్లినట్లు తెలిసింది. సమన్వయ కమిటీ సమావేశంలో ఏ ప్రాతిపదికన నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

నామినేట్ పదవుల కోసం ఢిల్లీలో మకాం వేసిన నాయకులు

పార్టీ పెద్దలతో సమాన్వయం చేసుకుంటున్న గడ్డం ఇందుప్రియ చంద్ర శేఖర్ రెడ్డి

తెలంగాణలో నామినేట్ పదవుల భర్తీపై చర్చలు వేగవంతం కావడంతో, పదవులను ఆశిస్తున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారంతో కామారెడ్డి నేతలు జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.పార్టీకి సేవలందించిన తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ, పలువురు నాయకులు వ్యక్తిగతంగా ఢిల్లీలోనే ఉండి అధిష్ఠాన పెద్దలతో సమావేశాలకు సమయం కోరుతున్నట్లు సమాచారం. తమకు అనుకూలంగా సిఫార్సులు చేయించుకునేందుకు రాజకీయ, సామాజిక వర్గాల ప్రముఖులతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, కమిషన్లకు త్వరలోనే నామినేట్ పదవులను భర్తీ చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్టీ కోసం పనిచేసిన నాయకుల సేవలు, రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే, నామినేట్ పదవుల జాబితాపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆశావహ నాయకులు చివరి వరకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఢిల్లీలోనే మకాం వేసిన పరిస్థితి కనిపిస్తోంది.