NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 11:12 am Posted by : MEDUDHULA KASHAGOUD

భారీ వర్షాలకు నేలమట్టమైన ఇల్లు

-బాధిత కుటుంబానికి గ్రామ పెద్దల పరామర్శ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూలై 31:

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ పాత ఇల్లు కూలిపోవడంతో బాధిత కుటుంబానికి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న గ్రామ పెద్దలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాబురావు, ఉపసర్పంచ్ కృష్ణ, గ్రామ సీనియర్ నాయకులు తోట మాణిక్, ఆత్మారాం, మాజీ సర్పంచ్ దండూ గంగాధర్, సీనియర్ నాయకులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. వారు కూలిపోయిన ఇంటిని పరిశీలించి, భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.
అనంతరం మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సహాయం, గృహ పునర్నిర్మాణం కోసం అవసరమైన సాయం అందేలా సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్తామని తెలిపారు. వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో పాత ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గ్రామ ప్రజలకు సూచించారు.