NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 10:49 pm Posted by : MEDUDHULA KASHAGOUD

మద్యం మత్తులో డ్రైవింగ్‌కు చెక్.. 51 మందికి కోర్టు శిక్షలు..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 10:

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 51 మందిని గుర్తించి సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు మొత్తం రూ.62,000 జరిమానా విధించడంతో పాటు 13 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాకుండా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అత్యంత నిర్లక్ష్యమైన చర్య అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతుండగా, మరెందరో తీవ్ర గాయాలకు గురవుతున్నారని తెలిపారు.మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల డ్రైవర్ ప్రాణాలతో పాటు ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగిల్చే ప్రమాదం ఉందని, కుటుంబ సభ్యుల భద్రత కోసం అయినా మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకూడదని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది.”మద్యం సేవించి వాహనం నడపొద్దు… సురక్షితంగా ఇంటికి చేరండి” అని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.