NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 5:24 pm Posted by : MEDUDHULA KASHAGOUD

మహిళలు, చిన్నారులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

మహిళలు, చిన్నారులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

– సేవలను సమీక్షించిన కలెక్టర్ అశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 08:

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో జిల్లా భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పేర్కొన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా కామారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ బాధితులకు అందుతున్న సేవలు, నమోదైన కేసుల పురోగతి, వివిధ శాఖల మధ్య సమన్వయం, పునరావాస చర్యలు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవల అమలు తదితర అంశాలపై భరోసా కేంద్రం కోఆర్డినేటర్ మరియు సిబ్బందితో సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలికి ఒకే వేదికపై వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడం సంబంధిత శాఖల బాధ్యత అని అన్నారు. వైద్య, న్యాయ, పోలీసు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలితో సిబ్బంది సానుభూతితో, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు. వైద్య సేవలు, మానసిక కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం, పోలీసు సహాయం, పునరావాస సేవలు ఎలాంటి ఆలస్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని పేర్కొన్నారు.
అలాగే ప్రతి కేసులో బాధితుల వ్యక్తిగత వివరాల గోప్యతను అత్యంత ప్రాధాన్యతతో పరిరక్షించాలని, బాధితుల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా భరోసా కేంద్రం సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ భరోసా కేంద్రంలోని కౌన్సెలింగ్ గదులు, లీగల్ సెల్, మెడికల్ ఎయిడ్ విభాగం, రికార్డు నిర్వహణ విధానం, బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం కోఆర్డినేటర్ శ్రీమతి కవితతో పాటు భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.