NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 3:38 pm Posted by : MEDUDHULA KASHAGOUD

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీపై అధికారుల నిర్లక్ష్యం ప్రజల్లో ఆందోళన

-భగీరథ పైప్ లైన్ లీకేజ్ పై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారా…

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జులై 13:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న కాలేజీ గ్రౌండ్ వద్ద మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ లీకేజీ నెలకొనడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. లీకేజీ కారణంగా భారీగా నీరు వృథా అవుతుండటంతో పాటు కలుషిత నీరు పైప్‌లైన్‌లోకి చేరే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో లీకేజీ ప్రాంతంలో నిల్వ నీరు, మురుగునీరు చేరే అవకాశం ఉండటంతో తాగునీటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రజలు చెబుతున్నారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల వైరల్ జ్వరాలు, డయేరియా, ఇతర నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశమున్న ఈ లీకేజీని వెంటనే గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాల్సిన మిషన్ భగీరథ పథకంలో ఇలాంటి లీకేజీలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, మిషన్ భగీరథ శాఖ అధికారులు స్పందించి లీకేజీని సరిచేసి ప్రజల సమస్యకు పరిష్కారం చూపాలని కామారెడ్డి వాసులు కోరుతున్నారు.