NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 2:35 pm Posted by : MEDUDHULA KASHAGOUD

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి

-జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజ్ గౌడ్

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీబీపేట్, జూలై 22:

న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా ప్రధానమంత్రి నివాసం ఎదుట శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రా తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ ఘటనలపై న్యాయం కోరుతూ పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును కాలరాస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.దేశవ్యాప్తంగా నెల రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలుస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రశ్నించే గొంతులను అణచివేయడమేనని నాగరాజ్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని విద్యార్థుల సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమగ్ర వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.నీట్ పేపర్ లీకేజీ కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన విద్యార్థులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని, బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ సారథ్యంలో పోరాడుతుందని, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని నాగరాజ్ గౌడ్ స్పష్టం చేశారు.