NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 10:23 am Posted by : MEDUDHULA KASHAGOUD

లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.4 కోట్లు

-ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా పనుల ప్రారంభం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జూలై 23 :

గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గురువారం ప్రారంభించారు.
వరదల వల్ల బ్రిడ్జి దెబ్బతినడంతో లింగంపల్లి ఖుర్ద్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు నిత్యం రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయడంతో రూ.4 కోట్లతో కొత్తగా బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రజాధనం వృథా కాకుండా పనుల నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో లింగంపల్లి ఖుర్ద్, పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జి పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతమై రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.