NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 3:08 pm Posted by : MEDUDHULA KASHAGOUD

లింగాయపల్లి విద్యార్థులకు కాలేజ్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేయాలి యూఎస్‌ఎఫ్‌ఐ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జులై 21:

కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామాల విద్యార్థుల కోసం కాలేజ్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేయాలని కోరుతూ (యు.ఎస్.ఎఫ్.ఐ.) విద్యార్థి సంఘం ప్రతినిధులు ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా యూఎస్‌ఎఫ్‌ఐ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సిద్ధల నాగరాజ్, జిల్లా కార్యదర్శి నాగళ్ల సతీష్ మాట్లాడుతూ విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. “విద్యార్థులకు హక్కు – స్పెషల్ బస్సు మా డిమాండ్” అని నినదిస్తూ, సమయానికి బస్సు ఉంటేనే విద్యార్థులు కళాశాలలకు సకాలంలో చేరుకుని చదువులో రాణించగలరని అన్నారు.రాజంపేట, లింగాయపల్లి గ్రామాల నుంచి ప్రతిరోజూ సుమారు 50 నుంచి 70 మంది విద్యార్థులు కామారెడ్డి పట్టణంలోని వివిధ కళాశాలలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారని తెలిపారు. కళాశాలలు ఉదయం 8:35 గంటలకు ప్రారంభమవుతున్నప్పటికీ, గ్రామాల వద్ద బస్సులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు గంటల తరబడి బస్‌స్టాప్‌ల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బస్సులు ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు కళాశాలలకు ఆలస్యంగా చేరుకోవడంతో పాటు ముఖ్యమైన తరగతులు, పాఠ్యాంశాలు కోల్పోతున్నారని చెప్పారు. దీని ప్రభావం వారి విద్యాభ్యాసంపై తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రవాణా సమస్య ప్రధాన అడ్డంకిగా మారిందని, విద్యకు అడ్డుగా రవాణా సౌకర్యాల కొరత ఉండకూడదని అన్నారు.
అందువల్ల కామారెడ్డి జిల్లా ఆర్టీసీ అధికారులు ఈ సమస్యను అత్యవసరంగా పరిగణనలోకి తీసుకుని రాజంపేట – లింగాయపల్లి గ్రామాల విద్యార్థుల కోసం ఉదయం కళాశాల సమయానికి ప్రత్యేక కాలేజ్ బస్సును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.