NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 11:08 am Posted by : MEDUDHULA KASHAGOUD

విద్యాశాఖ అధికారిపై తీవ్ర ఆరోపణలు తహసీల్దార్‌కు ఫిర్యాదు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీర్కూర్, జూలై 21:

బీర్కూర్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)పై బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గైని సంపత్ తీవ్ర ఆరోపణలు చేస్తూ మంగళవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, బీర్కూర్ మండల పరిధిలోని జడ్పీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి వివిధ అవసరాల పేరుతో అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 9వ, 10వ తరగతి విద్యార్థుల నుంచి రూ.130 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కొన్ని పాఠశాలల్లో రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వసూళ్లు మండల విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకే జరుగుతున్నాయని గైని సంపత్ ఆరోపించారు.
అలాగే మండలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులను నియమించకుండా, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వ్యక్తులతోనే బోధన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఇటువంటి చర్యలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో అక్రమ వసూళ్లు, ప్రైవేట్ పాఠశాలల్లో అర్హతలేని ఉపాధ్యాయుల నియామకాలపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీయాలని గైని సంపత్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, నాణ్యతను కాపాడేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.