NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 10:52 pm Posted by : MEDUDHULA KASHAGOUD

సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం..

-గ్రామీణ ప్రజలను సైబర్ మోసాల నుంచి రక్షించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, జూలై 10:

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండలంలో నిర్వహించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి4సి ఎస్‌ఐ నరేష్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరాన్ని వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత అభివృద్ధితో పాటు సైబర్ నేరాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజలు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ప్రకటనల పేరుతో జరిగే మోసాలు, తక్షణ రుణాల మోసాలు, ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, సోషల్ మీడియా మోసాలు, APK ఫైళ్ల ద్వారా జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, డెబిట్ మరియు క్రెడిట్ కార్డు మోసాల గురించి సమగ్రంగా వివరించారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు లేదా APK ఫైళ్లను నమ్మరాదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, OTP, PIN, CVV వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని, ప్రతి గ్రామంలో సైబర్ నేరాల నివారణపై చైతన్యం పెంపొందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సైబర్ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందుతూ ఆసక్తిగా పాల్గొన్నారు.