NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 9:39 pm Posted by : MEDUDHULA KASHAGOUD

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన చేసిన పోలీసులు..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ఆగస్టు 14:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసును సదాశివనగర్ పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు, వారి నుంచి 36 గ్రాముల బంగారు ముక్కుపోగులతో పాటు చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ధర్మారావుపేట్ ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగులు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్ నంబర్ 157/2026, బి ఎన్ ఎస్ సెక్షన్లు 331(4), 305(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించడంతో పాటు నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తోగరి శ్రీనివాస్ (47), సదాశివనగర్, తోగరి మల్లేశ్వరి (41), ధర్మారావుపేట్లను నిందితులుగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఆగస్టు 8న ఇద్దరూ ధర్మారావుపేట్‌లోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి, ఆలయానికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. అనంతరం ఆలయం పక్కన ఉన్న రాయితో ఇనుప గేటు తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించి అమ్మవారి విగ్రహాలకు అలంకరించిన బంగారు ముక్కుపోగులను అపహరించారు. చోరీ చేసిన బంగారు వస్తువులను వెంటనే విక్రయించకుండా ఇంట్లోని బీరువాలో దాచిపెట్టారు. ఆగస్టు 14న చోరీ చేసిన బంగారు ముక్కుపోగులను కామారెడ్డిలో విక్రయించేందుకు హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో మర్కల్ ఎక్స్ రోడ్డు,ఎన్ హెచ్-44 వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని గమనించిన నిందితులు పట్టుబడతామనే భయంతో వాహనాన్ని వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని
వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించగా, వారి వద్ద నుంచి ఎల్లమ్మ ఆలయం నుంచి చోరీకి గురైన 36 గ్రాముల బంగారు ముక్కుపోగులు, నేరానికి ఉపయోగించిన హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్‌ను పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు తోగరి శ్రీనివాస్, వయస్సు 47 సంవత్సరాలు, సదాశివనగర్.
తోగరి మల్లేశ్వరి, వయస్సు 41 సంవత్సరాలు, ధర్మారావుపేట్. స్వాధీనం చేసుకున్న వస్తువులు 36 గ్రాముల బంగారు ముక్కుపోగులు.హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్. ఈ కేసు ఛేదనలో సదాశివనగర్ ఎస్సై ఎం. పుష్పరాజ్తో పాటు క్రైమ్ పార్టీ సిబ్బంది అజర్ ఫారూక్, పీసీ నరేష్, పీసీ ఇసాక్, ఏఆర్‌పీసీ ప్రభు కీలకంగా వ్యవహరించారు. నిందితులను గుర్తించడం, వెంబడించి పట్టుకోవడం, చోరీ సొత్తు మరియు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంలో సిబ్బంది సమయస్ఫూర్తి, సమన్వయం, అంకితభావంతో పనిచేశారు.కేసును సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న సదాశివనగర్ ఎస్సై, క్రైమ్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించారు.