NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 10:41 am Posted by : MEDUDHULA KASHAGOUD

ఎస్‌ఐఆర్‌-2026 హియరింగ్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

-నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత
గడువులోగా ధ్రువపత్రాలు సమర్పించాలి

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
జుక్కల్ ఆర్సీ ఆగస్టు 27:

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌-2026)లో భాగంగా కామారెడ్డి మండలం రాఘవాపూర్ గ్రామంలో గురువారం ప్రత్యేక హియరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటర్ల విచారణ ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ హియరింగ్‌లో ఓటరు జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు, దరఖాస్తులను అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా హియరింగ్‌కు హాజరైన ఓటర్లకు ఎస్‌ఐఆర్‌-2026 కార్యక్రమం ఉద్దేశం, ఓటరు జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకతపై అధికారులు, బీఎల్‌ఓలు అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, పేరు తొలగింపు, వ్యక్తిగత వివరాల సవరణకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించారు.ప్రతి ఓటరూ ఓటరు జాబితాలో తన పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, పేరు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి సకాలంలో సవరణలు చేయించుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలను సరిచేయడం ఎస్‌ఐఆర్‌-2026 ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ కంకర్నె, ఉప సర్పంచ్ అంజలి ప్రలాడ్ సూర్యవంశీ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు, వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌-2026లో భాగంగా హియరింగ్‌కు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లు వాటిని నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు.
తమకు కేటాయించిన హియరింగ్ తేదీన సంబంధిత కేంద్రానికి హాజరై, అధికారులు కోరిన పత్రాలను అందజేసి విచారణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్, ఉప సర్పంచ్ సూచించారు. ఓటరు జాబితా సక్రమంగా ఉండటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి అర్హత కలిగిన వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.హియరింగ్ కేంద్రంలో ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు కూడా హియరింగ్ కేంద్రానికి హాజరై తమ ఓటరు వివరాలను పరిశీలించుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ కంకర్నె, ఉప సర్పంచ్ అంజలి ప్రలాడ్ సూర్యవంశీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి జాదవ్, అధికారులు, వార్డు అధికారులు, బీఎల్‌ఓ భీంరావు, జీపీఓ సాయిలు తదితరులు పాల్గొన్నారు.