NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 1:26 pm Posted by : MEDUDHULA KASHAGOUD

కంటి దానం.. మరొకరి జీవితంలో వెలుగులు

-కంటి దానంపై అవగాహన కల్పిస్తూ కామారెడ్డిలో ఘనంగా ర్యాలీ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 25:

మరణానంతరం కంటి దానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. వెంకటి పిలుపునిచ్చారు. కంటి దానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న కంటి దాన పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం కామారెడ్డిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా కామారెడ్డి రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది, ఏ.ఎన్.ఎం. లు, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటి దానం ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.మరణానంతరం ఇద్దరికి చూపునిచ్చే అవకాశం ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె. వెంకటి మాట్లాడుతూ.. కంటి దానం అనేది ఒక వ్యక్తి మరణానంతరం కూడా మరొ ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప మానవతా సేవ అని అన్నారు. చూపు కోల్పోయిన కొంతమందికి కార్నియా మార్పిడి ద్వారా దృష్టిని పునరుద్ధరించే అవకాశం ఉంటుందని తెలిపారు.కంటి దానం విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. కంటి దానం చేయాలనే సంకల్పాన్ని కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయడం ఎంతో ముఖ్యమన్నారు. మరణం సంభవించిన వెంటనే సంబంధిత కంటి బ్యాంకు లేదా అధీకృత ఆరోగ్య సంస్థకు సమాచారం అందించడం ద్వారా కంటి సేకరణ ప్రక్రియకు సహకరించవచ్చని తెలిపారు.
అపోహలు వీడి.. అవగాహన పెంచుకోవాలి కంటి దానం శాస్త్రీయంగా, వైద్యపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే ప్రక్రియ అని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. కంటి దానం చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అధీకృత కంటి బ్యాంకులు, సంబంధిత వైద్య సంస్థల ద్వారా సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.కంటి దానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని, కుటుంబ సభ్యుల సహకారం, సమయానుకూల సమాచారం, వైద్య సిబ్బంది సమన్వయం కంటి సేకరణలో కీలకమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఏం. లు, ఇతర ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా కుటుంబ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆకట్టుకున్న అవగాహన నినాదాలు ర్యాలీలో పాల్గొన్న వారు “కంటి దానం చేయండి – అంధుల జీవితాల్లో వెలుగులు నింపండి”, “మరణానంతరం కంటి దానం – మహోన్నత మానవతా సేవ”, “మీ కళ్లతో మరొ ఇద్దరి జీవితాలకు చూపునివ్వండి”, “కంటి దానం – జీవితాంతం గుర్తుండే దానం”, “చూపును పంచండి – వెలుగును పెంచండి” అంటూ నినాదాలు చేశారు.కంటి దాన పక్షోత్సవాలను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో శాశ్వతమైన సామాజిక చైతన్యం తీసుకువచ్చే ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని డాక్టర్ జె. వెంకటి పిలుపునిచ్చారు.ప్రముఖుల పాల్గొనడం ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆర్‌ఎంఓ డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ స్వప్న (ఆప్తాలమాలజిస్ట్), డాక్టర్ రాజు (ఏవో), డాక్టర్ చందన ప్రియా, ఐ.ఏం.ఏ. అధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున్, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, గంగాధర్, లింబాద్రి హరికిషన్, రవీందర్, రంజిత్, మహేందర్ రెడ్డి, వేణుగోపాల్, చెలపతి, విఠల్ రావు, శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, రవి, రమణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వర్డ్, సఖి, వివిధ ఎన్జీవో ప్రతినిధులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.“మన జీవితం ముగిసినా.. మన కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగు కొనసాగవచ్చు. కంటి దానం ద్వారా మరొకరికి చూపు ప్రసాదిద్దాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు.