NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:31 pm Posted by : MEDUDHULA KASHAGOUD

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు..

-160 మంది పోలీసుల పాల్గొనికతో రాజీవ్‌నగర్, డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో విస్తృత తనిఖీలు

-121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు, తల్వార్, మద్యం బాటిళ్లు స్వాధీనం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 04:

ప్రజలకు మరింత చేరువ కావడం, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా కామారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పరిసరాల్లో ఉదయం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసు-ప్రజల మధ్య విశ్వాస బంధాన్ని బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో భాగంగా చేపట్టిన తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు గుర్తించగా, వాటిలో 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో ఫోటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్న ఎస్పీ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కుటుంబ సభ్యులు రోజుకు కనీసం ఒకపూట కలిసి భోజనం చేయడం ద్వారా పిల్లల ఆలోచనలు, అలవాట్లను తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గంజాయి వ్యసనానికి గురైన వారిని డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీసు శాఖ సహకరిస్తుందని తెలిపారు.సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, కేవైసీ, పెట్టుబడుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.ప్రజల సమాచారమే నేరాల ఛేదనకు అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో ఛేదించిన పలు దొంగతన కేసుల్లో ప్రజలు అందించిన సమాచారం కీలక పాత్ర పోషించిందన్నారు. కాలనీలు, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, గంజాయి లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.రోడ్డు భద్రతపై మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటి, వ్యాపార సంస్థ వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణకు సహకరించవచ్చని వివరించారు.కార్యక్రమంలో భాగంగా అనుమానితులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, జీవనశైలిని తెలుసుకున్నారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉండి మంచి ప్రవర్తన కనబరిస్తే చట్టపరమైన నిబంధనల మేరకు షీట్ల తొలగింపును పరిశీలిస్తామని తెలిపారు. అలాగే కరాటేలో ప్రతిభ కనబరిచిన యువతను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, బిక్కనూర్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఆర్‌ఐలు సంతోష్, నవీన్, కృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.