(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 25:
బెంగళూరు కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రిజ్వాన్ అర్షద్, డా. అజయ్ ధరం సింగ్‌లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులను శాలువాలతో సన్మానించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.శివాజీనగర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రిజ్వాన్ అర్షద్‌కు కర్ణాటక కేబినెట్‌లో ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలను కేటాయించారు. అలాగే జేవర్గి ఎమ్మెల్యే డా. అజయ్ ధరం సింగ్‌కు పెద్ద, మధ్య తరహా నీటిపారుదల, చిన్న నీటిపారుదల, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖలను అప్పగించారు.ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నూతన బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు మంత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, తమకు అప్పగించిన శాఖల్లో సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. మర్యాదపూర్వక భేటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు అంశాలతో పాటు రాజకీయ, ప్రజా సంబంధిత విషయాలపై కూడా చర్చించినట్లు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై స్నేహపూర్వకంగా అభిప్రాయాలు పంచుకున్నట్లు పేర్కొన్నారు.