NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 4:10 pm Posted by : MEDUDHULA KASHAGOUD

కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి..

-జీవీఎస్, డీఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి,
ఆగస్టు 20:

కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీవీఎస్, డీఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జీవీఎస్ జిల్లా అధ్యక్షుడు సభావత్ వినోద్ నాయక్, డీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కళాశాలలో అవసరమైన అదనపు తరగతి గదులను నిర్మించడంతో పాటు విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని, ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను అధికారులు ప్రత్యేక దృష్టితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సుమన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.