NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 9:53 pm Posted by : MEDUDHULA KASHAGOUD

ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా గుట్టురట్టు మరో నిందితుడు అరెస్ట్..

-మద్నూర్, జుక్కల్, పెద్దకొడపగల్, బిచ్కుంద, పిట్లం మండలాల్లో వరుస ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు

-సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు – పనిముట్లు, కత్తి, బైక్, నగదు స్వాధీనం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
జుక్కల్ ఆర్సీ ఆగస్టు 22:

కామారెడ్డి జిల్లాలో వరుసగా జరుగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మరో నిందితుడు భీమ్‌రావును అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించి నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి పోలీసులు ఈ ముఠాను గుర్తించారు. మద్నూర్ మండలం లచ్చన్ గ్రామానికి చెందిన జాదవ్ దత్తు తన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 5 గ్రాముల బంగారం, రూ.15 వేల నగదు అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ శ్రీ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను పరిశీలించడంతో పాటు నిందితుల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో సలాబత్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద మద్నూర్ ఎస్‌ఐ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్‌పై అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తిని పోలీసులు ఆపి విచారించారు. విచారణలో అతను లచ్చన్ గ్రామంలో జరిగిన చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో పాటు, మరికొందరితో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.ఐదుగురితో కలిసి చోరీల ముఠా
నిందితుడు భీమ్‌రావు, అర్జున్, సుభాష్, కరీం, సునీల్ కలిసి ముఠాగా ఏర్పడి మద్నూర్, జుక్కల్, పెద్దకొడపగల్, బిచ్కుంద, పిట్లం మండలాల్లో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్‌ను దొంగిలించి ఔరంగాబాద్‌లో విక్రయించేవారని, విక్రయం ద్వారా వచ్చిన నగదును ముఠా సభ్యులు సమానంగా పంచుకునేవారని పోలీసులు తెలిపారు.అలాగే నిందితుడు భీమ్‌రావుపై నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 22 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.స్వాధీనం చేసుకున్న వస్తువులు ట్రాన్స్‌ఫార్మర్ విప్పేందుకు ఉపయోగించే పనిముట్లు నేర సమయంలో అడ్డువచ్చే వారిని బెదిరించేందుకు ఉపయోగించిన కత్తి
నేరానికి ఉపయోగించిన బైక్  చోరీ సొత్తు విక్రయం ద్వారా వచ్చిన నగదులో మిగిలిన రూ.2,000 భీమ్‌రావును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే అర్జున్, సునీల్, కరీం, సుభాష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు వరుస ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను సాంకేతిక ఆధారాలతో గుర్తించి నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన మద్నూర్ ఎస్‌ఐ, పిట్లం ఎస్‌ఐ, పెద్దకొడపగల్ ఎస్‌ఐలతో పాటు కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, వెంకటేశ్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.