NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:47 am Posted by : MEDUDHULA KASHAGOUD

విశాల షాపింగ్ మాల్‌లో తప్పిపోయిన బాలుడు..

-పోలీసుల చొరవతో తల్లిదండ్రుల చెంతకు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 19:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ ఎక్స్ రోడ్డులోని విశాల షాపింగ్ మాల్‌లో బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చిన కుటుంబానికి చెందిన ఐదేళ్ల బాలుడు అన్విక్ తప్పిపోవడంతో కామారెడ్డి పోలీసులు చొరవ తీసుకుని అతడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇస్రోజివాడికి చెందిన కంచర్ల శంకర్, పావని దంపతులు తమ ఐదేళ్ల కుమారుడు అన్విక్‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో నిజాంసాగర్ రోడ్డులోని విశాల షాపింగ్ మాల్‌కు బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో బాలుడు అన్విక్ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు.బాలుడు ఒంటరిగా కనిపించడంతో ఆటో డ్రైవర్ కొంక ప్రసాద్ అతడిని గుర్తించి కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. అనంతరం ఎస్‌హెచ్‌ఓ సూచనల మేరకు పోలీసులు బాలుడి వివరాలను తెలుసుకుని, అతడి తల్లిదండ్రులను గుర్తించేందుకు గ్రామాల వాట్సాప్ గ్రూపులు, మీడియా ద్వారా సమాచారం పంపించారు. పోలీసులు, మీడియా ద్వారా వెలువడిన సమాచారాన్ని తెలుసుకున్న అన్విక్ తల్లిదండ్రులు వెంటనే కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వివరాలను పరిశీలించిన పోలీసులు బాలుడు అన్విక్‌ను అతడి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించిన ఆటో డ్రైవర్ కొంక ప్రసాద్‌ను పోలీసులు అభినందించారు. పోలీసుల సమయస్ఫూర్తి, చొరవతో బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.