NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 9:49 am Posted by : MEDUDHULA KASHAGOUD

హరిత గ్రామాలే లక్ష్యంగా వన మహోత్సవం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
జుక్కల్ ఆర్‌సీ, ఆగస్టు 25:

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తడిహిప్పర్గ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ కంకర్నె అన్నారు.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మంగళవారం ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తడిహిప్పర్గ గ్రామంలో సర్పంచ్ అశ్విని సుదర్శన్ కంకర్నె ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేవలం ఒకరోజుకే పరిమితం చేయకుండా, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చన్నారు.
ప్రతి గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మొక్కను నాటడం కంటే దాన్ని సంరక్షించడమే ముఖ్యమని, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచితేనే వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందన్నారు.భవిష్యత్ తరాల కోసం ప్రతి కుటుంబం కనీసం కొన్ని మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. “మొక్క నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. మన గ్రామాలను పచ్చదనంతో నింపుదాం” అని పిలుపునిచ్చారు. హరిత గ్రామాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి జాదవ్, ఉప సర్పంచ్ అంజలి ప్రళాద్ సూర్యవంశీ, ఫీల్డ్ అసిస్టెంట్ అర్జున్ గైక్వాడ్, వార్డు సభ్యులు ప్రకాష్, దొండిబా, గౌస్, లింగురామ్, రాహుల్, రమేష్, భగీరతబాయ్, గౌరాబాయ్, భారత్‌తో పాటు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.