NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 4:19 pm Posted by : MEDUDHULA KASHAGOUD

మామూళ్లు ఇచ్చుకో.. ఇసుక తోడేసుకో..

–అధికారుల కనుసైగల్లోనే అక్రమ ఇసుక దందా..?

-రాత్రివేళల్లో మంజీరా నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు

-మహారాష్ట్ర, కర్ణాటకకు తరలింపు ప్రభుత్వ ఆదాయానికి గండి

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
జుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 01: పి. నాగభూషణ్

ఉమ్మడి మద్నూర్, డోంగ్లి మండలాల్లో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామ పరిధిలోని మంజీరా నది పరివాహక ప్రాంతం అక్రమ ఇసుక రవాణాకు కేంద్రంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రివేళల్లో సుమారు 15 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు.స్థానికుల కథనం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. చీకటిని ఆసరాగా చేసుకుని మంజీరా నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తోడుతూ నది గట్టును గుల్ల చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది నుంచి తీసిన ఇసుకను ముందుగా సమీప గ్రామాల్లో డంప్ చేసి, అక్కడి నుంచి ఐచర్ వాహనాల ద్వారా అధిక ధరలకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల కనుసైగల్లోనే దందా..? అక్రమ ఇసుక రవాణాపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ క్షేత్రస్థాయి రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కనుసైగల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని, మామూళ్ల వసూళ్ల కారణంగా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, ఉన్నతాధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఉమ్మడి మద్నూర్, డోంగ్లి మండలాల్లో అక్రమ ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదని ప్రజలు అంటున్నారు. రాత్రివేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నట్లు వారు చెబుతున్నారు.ప్రభుత్వ ఆదాయానికి గండి
అక్రమంగా ఇసుకను తరలించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ, పన్నుల ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఇసుకను విచ్చలవిడిగా తవ్వడం వల్ల నది గట్టు దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి ఉమ్మడి మండలాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాకు వెంటనే అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మంజీరా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.