-మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు
(నమస్తే ఇందూర్) వరంగల్ జిల్లా ఎల్కతుర్తి, నవంబర్ 04:
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరు, పోలీసుల విధులు, చట్టాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌లోని సెంటాన్ హైస్కూల్ విద్యార్థులకు బుధవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) నరసింహారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం కేసు స్వభావాన్ని బట్టి సంబంధిత చట్టాలు, సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని వివరించారు. ఎస్‌ఐ విధులు, పోలీస్ సిబ్బంది బాధ్యతలు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల విచారణ తదితర అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, ఎస్‌ఐ కార్యాలయం, మహిళా విభాగాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వాటి పనితీరును వివరించారు.విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలుగా మారవద్దని సూచించారు. ఎక్కడైనా మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.