జోరుగా అక్రమ మొరం దందా…
నమస్తే ఇందూర్, జుక్కల్ నవంబర్ 16
నమస్తే ఇందూర్, అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగిస్తుండడంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మద్నూర్ మండలంలో అంతఃపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండానే పందికొక్కుల మొరం తోడేస్తున్నారు. నిఘా బెట్టి చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. మొరం మట్టి తరలింపు ట్రాక్టర్లను పట్టుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఒక్కొక్క ట్రాక్టర్ లోడ్ మొరం మట్టికి రూ.650 నుంచి రూ.700 వరకు, దూరం ఎక్కువైతే అదనంగా మరో రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేసుకుంటున్నారు. టిప్పర్ లోడ్ మొరానికి రూ 2వేల నుంచి రూ. 2500 తీసుకుంటూ లక్ష రూపాయల్లో అక్రమార్జన చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలు గా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..
ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మండల రెవెన్యూ, భూగర్భ గనుల అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మేరకు వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి తవ్వకాలు చేపట్టాలి. ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయమై మద్నూర్ తహసీల్దార్ ను “నమస్తేఇందూర్’ సంప్రదించగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టిని తరలించే వారిపై తగు చర్యలు చేపడుతున్నామన్నారు. అక్రమంగా మొరం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు ఎంతటి వారి వైనా సరే పట్టుకుని సీజ్ చేస్తున్నామన్నారు.




