డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టం..
నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 23
దేశం గర్వించదగ్గ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం..
డిసెంబర్ 2న ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ..
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జిల్లాకు చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని యూనివర్సిటీ ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ్యులు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తదితరులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. వేదిక, స్టేజ్, శిలాఫలకం, అతిథుల వసతి, మీడియా సెంటర్, పార్కింగ్, రాకపోకలు వంటి అంశాల పరిశీలన అనంతరం ప్రతిపాదిత ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా వ్యవస్థలో ఎటువంటి లోపం లేకుండా అన్ని శాఖలు పోలీసు విభాగంతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అన్ని విభాగాలు చేపట్టాల్సిన బాధ్యతలను శాఖలవారీగా మంత్రి స్పష్టంగా వివరించారు.
అనంతరం పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేశంలో ఇప్పటివరకు లేని ప్రత్యేక సబ్జెక్టులతో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ను తెలంగాణ ప్రభుత్వం స్థాపిస్తున్నదని పేర్కొన్నారు. గతంలో సింగరేణి సంస్థ నిర్వహించిన స్కూల్ ఆఫ్ మైన్స్ ను గుర్తుచేస్తూ, 1996లో జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అవసరాన్ని గుర్తించి అధికారిక గుర్తింపుకు కృషి చేసిన విషయాన్ని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విశ్వవిద్యాలయం లేమి దృష్ట్యా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సాధారణ విశ్వవిద్యాలయాలకు భిన్నంగా భూగోళ శాస్త్రాలు, సహజ వనరులు, ఖనిజ పరిశోధనలకు ఉపయోగపడే విధంగా దేశ భవిష్యత్తుకు దోహదం చేసే ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలతో రూపొందించిన ప్రతిపాదనను ప్రభుత్వం నిపుణులతో కలిసి ఆరు నెలలపాటు పరిశీలించి, సాధ్యతా నివేదిక ఆధారంగా అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిందని మంత్రి వివరించారు. ‘ఖనిజ సంపదలకు పుట్టినిల్లు’గా నిలిచిన కొత్తగూడెం జిల్లా, అరుదైన ఖనిజాల లభ్యతతో ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ స్థాపనకు అత్యుత్తమ ప్రదేశంగా ఎంపికైందని, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భవిష్యత్ తరాల విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేక కట్టుబాటుతో యూనివర్సిటీ అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు.
దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడైన, దేశానికి పదేళ్లు ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించారని, మంత్రివర్గం మరియు అసెంబ్లీ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. 300 ఎకరాల విస్తీర్ణంలో, జాతీయ రహదారి పక్కనే అభివృద్ధి చెందుతున్న ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థగా నిలవనున్నదని చెప్పారు. ప్రజా పాలన చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారు చేసినట్టు ఆయన వివరించారు దీనిలో భాగంగా డిసెంబర్ 2న మన జిల్లాకు యూనివర్సిటీ ప్రారంభానికి ముఖ్యమంత్రి రానున్నారని ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ ఉంటుందని వివరించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కె. సుజాత, పాల్వంచ డీఎస్పీ కె. సతీష్, పాల్వంచ తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.





