(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూలై 30:
గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలోని తన నివాసంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.గర్భధారణ సమయంలో మహిళలకు పోషకాహారంతో కూడిన సమతుల్య ఆహారం అందించడం ప్రతి కుటుంబ సభ్యుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గర్భిణీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు (తొలి పాలు) తప్పనిసరిగా ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. తల్లి పాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు.ఈ సందర్భంగా తన చిన్ననాటి అనుభవాన్ని పంచుకుంటూ, “నేను కూడా చిన్నతనంలో నాలుగేళ్ల పాటు తల్లి పాలు తాగాను. అందువల్లే ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతి బిడ్డకు తల్లి పాలు అందితే వారు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు” అని అన్నారు.ప్రతి కుటుంబం శుభ్రమైన, సురక్షితమైన తాగునీటినే వినియోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక అంటువ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు.


