(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి జూలై 31:
కామారెడ్డి జిల్లా విద్యాధికారి (డీఈవో) మల్లికార్జున్ తాడ్వాయి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ కృష్ణాజివాడి, ఎంపీపీఎస్ కృష్ణాజివాడి పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, బోధన విధానాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల చదవడం, అర్థం చేసుకునే నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థి మణికాంత్ను చదివించి అతని అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించిన డీఈవో, ప్రతి విద్యార్థి విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల అభ్యసన స్థాయిని మరింత మెరుగుపరిచేందుకు అనుసరించాల్సిన బోధనా విధానాలు, ప్రత్యేక కార్యాచరణ, నిరంతర మూల్యాంకనం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రామస్వామి, ఉపాధ్యాయులు గిర్మాబోయి, శ్వేత, సుజాత, శ్రీహరి, బాబురావు, సంధ్యారాణి, సరిత, రాజారెడ్డి, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు సంగుబాయి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


