-14 ఏళ్లు గడిచినా కోర్టుల చుట్టూ తిరుగుతున్న విద్యార్థి సంఘాల నాయకులు
-ఈ కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన ఉద్యమ విద్యార్థి నాయకుడు తుమ్మల రాకేష్ కూడా నిందితుడిగా ఉండటం గమనార్హo
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 07:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులపై 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 14 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఆ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోవడం బాధాకరమని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.2012లో బోధన్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగాన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకున్న నేపథ్యంలో, అప్పటి బోధన్ సీఐ శంకరయ్య ఆధ్వర్యంలో పలువురు విద్యార్థి నాయకులపై అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను నేరస్థులుగా చిత్రీకరించడం అన్యాయమని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 14 సంవత్సరాలు గడిచినా, మధ్యలో పలు ప్రభుత్వాలు మారినా ఉద్యమ విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడంలో ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని వారు ఆరోపించారు. ఫలితంగా విద్యార్థి నాయకులు ఇప్పటికీ బోధన్ కోర్టుకు హాజరవుతూ మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన ఉద్యమ విద్యార్థి నాయకుడు తుమ్మల రాకేష్ కూడా నిందితుడిగా ఉండటం గమనార్హమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారేనని, వారిపై నమోదైన కేసులను కొనసాగించడం తెలంగాణ
ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అందువల్ల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులపై నమోదైన అన్ని అక్రమ కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకుని, వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


