(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 22:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పసికందు మృతి చెందడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. లింగంపేట మండలం ఎక్కపల్లి గ్రామానికి చెందిన స్వరూప (20), భర్త సరిచంద్, శుక్రవారం రాత్రి ప్రసవం కోసం కామారెడ్డి జీజీహెచ్‌లో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో ఆమెకు నార్మల్ డెలివరీ జరిగి మగ శిశువు జన్మించినప్పటికీ, అప్పటికే శిశువు మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు.ప్రసవం విషయంలో సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులు కోరినప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకుండా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించారని, దీంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమంటూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించి పూర్తి వివరాలను వెల్లడించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే శిశువు మృతికి అసలు కారణం ఏమిటనే విషయం వైద్యుల అధికారిక వివరణ, వైద్య రికార్డులు మరియు విచారణ అనంతరం స్పష్టత రావాల్సి ఉంది.


