Saturday, August 29, 2026
Homeతెలంగాణనేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి..

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి..

📰 Generate e-Paper Clip

-కామారెడ్డి జిల్లా పోలీసు అధికారులకు జోన్‌-III ఇన్‌చార్జ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 21:

జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జోన్‌-III ఇన్‌చార్జ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితి, వివిధ రకాల నేరాల నమోదు–దర్యాప్తు, కేసుల డిటెక్షన్‌, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలపై డీఐజీకి సమగ్ర వివరాలను అందించారు.
నేరాల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి
కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో కొన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టగా, మరికొన్ని నేరాల్లో పెరుగుదల కనిపిస్తోందని డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. నేరాల పెరుగుదలకు గల కారణాలను సంబంధిత అధికారులు లోతుగా విశ్లేషించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ఫోకసింగ్ అప్రోచ్‌తో ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి నివాస ప్రాంతాలకు వెళ్లి పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు. నేరాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయి పరిశీలన రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఐజీ అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన ప్రతి ప్రాంతాన్ని సంబంధిత అధికారులు స్వయంగా సందర్శించి, ప్రమాదానికి అసలు కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యలను సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు.గంజాయి నిర్మూలనకు పటిష్ట కార్యాచరణ జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. గంజాయికి బానిసైన వ్యక్తులను గుర్తించి డీ-అడిక్షన్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలని, అదే సమయంలో గంజాయి సరఫరా, రవాణా వ్యవస్థను గుర్తించి దాని మూలాలను ఛేదించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సైబర్ నేరాలపై విస్తృత అవగాహన
ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సైబర్ నేరాలపై ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు, సాంకేతిక భద్రతా చర్యలపై విస్తృత అవగాహన కల్పించాలని డీఐజీ సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వహిస్తూ నేరాల నివారణలో 100 శాతం సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు.ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటును విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పోలీస్‌స్టేషన్లలో పరిశుభ్రత, క్రమబద్ధీకరణ కోసం 5S విధానాన్ని అమలు చేయాలని, సిబ్బంది విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం ప్రోత్సహించాలని తెలిపారు.
అలాగే గుట్కా, మట్కా, అక్రమ గేమింగ్‌, ఇతర జూద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీ
అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ కామారెడ్డి డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేసు ఫైల్స్ తదితరాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా, నిష్పక్షపాతంగా కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశం, వార్షిక తనిఖీల కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ అడ్మిన్ కే. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డితో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!