(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 26:
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు సంఘీభావంగా కామారెడ్డి పట్టణానికి చెందిన బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున భాగ్యనగర్‌కు తరలివెళ్లారు.‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు విద్యార్థులు, యువత నుంచి విశేష మద్దతు లభిస్తోందని బీజేపీ నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు. సుమారు రూ.15 వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో ఉంచడం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి పట్టణ బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో భాగ్యనగర్‌కు తరలివెళ్లినట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.


