Friday, August 28, 2026
Homeతెలంగాణమూడు నెలలుగా వేతనాలు లేక ఫీల్డ్ అసిస్టెంట్ల ఆవేదన..

మూడు నెలలుగా వేతనాలు లేక ఫీల్డ్ అసిస్టెంట్ల ఆవేదన..

📰 Generate e-Paper Clip

-రివ్యూ సమావేశాన్ని బహిష్కరించి ఎంపీడీవోకు వినతిపత్రం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి, జూలై 25:

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తాడ్వాయి మండలంలో నిర్వహించిన రివ్యూ సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) భరత్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మే, జూన్ నెలలతో పాటు ప్రస్తుత నెలకు సంబంధించిన వేతనాలు కూడా ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. సకాలంలో జీతాలు అందక కుటుంబాల పోషణ భారంగా మారిందని, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, నిత్యావసర ఖర్చులు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని వాపోయారు.దాదాపు 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో సేవలందిస్తున్నప్పటికీ, ఇలా నెలల తరబడి వేతనాలు నిలిపివేయడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఫీల్డ్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేస్తున్న తమకు కనీస వేతనాలు కూడా సకాలంలో అందకపోవడం బాధాకరమని అన్నారు.పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి, ఇకపై ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి సంతోష్, ఉపాధ్యక్షుడు రమేష్, కోశాధికారి సాయన్న, సభ్యులు సంజీవరెడ్డి, బాలరాజు, చిరంజీవి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!