-బోర్‌వెల్ రీఛార్జ్, ఫామ్‌పాండ్‌లు, ఇంకుడు గుంతలు, సీజనల్ వ్యాధుల నివారణపై అధికారులకు ఆదేశాలు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి జూలై 25:
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కార్యాలయంలో శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు, పారిశుధ్యం, వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో ప్రతి గ్రామపంచాయతీలో బోర్‌వెల్ రీఛార్జ్ పనులను వెంటనే ప్రారంభించాలని, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే ఫామ్‌పాండ్‌ల కోసం అనువైన ప్రదేశాలను గుర్తించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాల ప్రాంగణాల్లో కూడా ఇంకుడు గుంతల ఏర్పాటును పూర్తి చేయాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణకు ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.అదేవిధంగా వనమహోత్సవం లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, గ్రామాల్లో ఊటకుంటల తవ్వకం, నూతన బావుల తవ్వకం పనులను చేపట్టాలని సూచించారు.
గ్రామాల్లో 8.4 రకాల చెత్త సేకరణ వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని, అవసరమైన చోట ఫాగింగ్ యంత్రాల కొనుగోలు, మరమ్మతులు చేపట్టాలని, ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ తయారు చేసి వినియోగించాలని పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, ఎంఏఓ, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను నిర్దిష్ట గడువులో పూర్తి చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


