Friday, August 28, 2026
Homeతెలంగాణకామారెడ్డి ట్రాఫిక్ గేట్ 209-ఏ వద్ద అండర్‌పాస్ నిర్మించాలి..

కామారెడ్డి ట్రాఫిక్ గేట్ 209-ఏ వద్ద అండర్‌పాస్ నిర్మించాలి..

📰 Generate e-Paper Clip

-ఎస్.సి.ఆర్. జనరల్ మేనేజర్‌తో సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కర్ వినతి

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 20:

కామారెడ్డి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రాష్ట్రాల ఎంపీలతో (ఎస్.సీ.ఆర్.) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కర్ హాజరై కామారెడ్డి జిల్లా రైల్వే సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సమావేశానికి ముందు కామారెడ్డి రైల్వే స్టేషన్ మాస్టర్‌తో ఎంపీ మాట్లాడి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సమస్యలను తెలుసుకున్నారు. స్టేషన్ మాస్టర్ వివరించిన అంశాలను (ఎస్.సి.ఆర్.) జిఎం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీ కోరారు. ట్రాఫిక్ గేట్ 209-ఏ వద్ద అండర్‌పాస్ నిర్మించాలి కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ గేట్ 209-ఏ ఫ్రోబెల్ స్కూల్ సమీపంలో వెంటనే అండర్‌పాస్ బ్రిడ్జిని నిర్మించాలని ఎంపీ సురేష్ షెట్కర్ డిమాండ్ చేశారు. గేట్ అవతలి వైపు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తదితర ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నందున ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. రైలు రాకముందు గేట్ మూసివేయడంతో ప్రజలు సుమారు 25 నుంచి 30 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తోందని, దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అండర్‌పాస్ నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరారు.బిక్కనూర్‌లో డెమో రైలుకు హాల్ట్ ఇవ్వాలి అదేవిధంగా నిజామాబాద్–కాచిగూడ డెమో రైలు నంబర్ 77643ను బిక్కనూర్‌లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ రైలుకు బిక్కనూర్‌లో హాల్ట్ కల్పిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
తిప్పాపూర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు తిప్పాపూర్ గ్రామంలోని రైల్వే స్టేషన్‌ను పూర్తి స్థాయిలో రైల్వే శాఖ ఆధీనంలోకి తీసుకుని మరింత అభివృద్ధి చేయాలని ఎంపీ కోరారు. అలాగే కాచిగూడ–నిజామాబాద్ రైలు నంబర్ 77602కు తిప్పాపూర్‌లో హాల్ట్ కల్పించాలని కోరారు. ఎంపీ సురేష్ షెట్కర్ వినతులపై (ఎస్.సి.ఆర్.) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించి, ఆయా సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!