-ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచన
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 01:
కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ భవనాన్ని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి, ప్రజలకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దిన నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శనివారం ప్రారంభించారు. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ అవుట్‌పోస్ట్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్‌ను జిల్లా ఎస్పీ అభినందించి, విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, సమస్యలపై వేగంగా స్పందించే విధంగా సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవుట్‌పోస్ట్‌కు అవసరమైన పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షిత ప్రయాణ వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ట్రాఫిక్ పోలీసులు చట్టాలను అమలు చేయడంతో పాటు ప్రజలకు సేవలందించే బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య కేంద్రాలు, ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎస్పీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.”ట్రాఫిక్ నియమాలు పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు.మీ కుటుంబం కోసం, మీ ప్రాణాల కోసం తీసుకునే ఉత్తమ నిర్ణయం. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలి” అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్హెచ్ఓ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్, టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


