రహదారిపై నీటి కుంటలో కౌన్సిలర్ నిరసన!
స్టేషన్ రోడ్డులో వరద నీటితో కుంటను తలపిస్తున్న ప్రధాన రహదారి
ట్రాఫిక్ జామ్తో వాహనదారుల అవస్థలు.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే 108 వాహనాలకూ తీవ్ర ఇబ్బందులు
నమస్తే ఇందూర్/కామారెడ్డి టౌన్, ఆగస్టు 8: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిలోని స్టేషన్ రోడ్డులో పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రహదారి కుంటను తలపిస్తోంది. నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. నీటి కుంటలో గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఇదే మార్గంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉండటంతో రోగులు, క్షతగాత్రులు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే 108 వాహనాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమస్యపై అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు 46, 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న–లక్ష్మినారాయణ రహదారిపై నిలిచిన నీటి కుంటలో కూర్చొని నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచే సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారి కావడంతో సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, లేనిపక్షంలో సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడే దీక్ష చేపడతామని కౌన్సిలర్ హెచ్చరించారు. అధికారులు ఇకనైనా స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


