-నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్, జూలై 21:
వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యాచ్ ది రెయిన్” (వర్షం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఒడిసిపట్టడం) అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నీరు మానవ జీవనానికి, వ్యవసాయానికి, పర్యావరణ సమతుల్యతకు అత్యంత కీలకమైన సహజ వనరని అన్నారు. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి భవిష్యత్ అవసరాలకు నీటి కొరత తలెత్తకుండా ఉంటుందని వివరించారు. రైతులు ప్రతి వర్షపు చుక్క కోసం ఆశగా ఎదురుచూస్తారని, అలాంటి అమూల్యమైన నీటిని నిర్లక్ష్యంగా వృథా చేయడం సమంజసం కాదన్నారు.ఇంట్లోనూ, పాఠశాలల్లోనూ నీటిని పొదుపుగా వినియోగించే అలవాటు అలవరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. చిన్నప్పటి నుంచే నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకుంటే సమాజంలో మంచి మార్పు వస్తుందని తెలిపారు. వర్షపు నీటిని సేకరించే విధానాలు, నీటి పొదుపు పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్ రావు, టీపీఓ వినీత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించి, వర్షపు నీటి ప్రాధాన్యతను వివరిస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

