-నిందితుడి వద్ద నుంచి ఆపిల్ ఐఫోన్, ఇతర డిజిటల్ ఆధారాలు స్వాధీనం
– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 05:
కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్లో నమోదైన ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ మోసం కేసులో మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు చేపట్టిన ముమ్మర గాలింపు చర్యల్లో ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కినట్లు ఎస్పీ వెల్లడించారు.ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సమాచారం, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగించారు. కామారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో పనిచేసిన బృందాలు ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న ముత్యాల నాయుడు అలియాస్ రొంగలి ముత్యాలు నాయుడు (36)**ను గుర్తించి అరెస్ట్ చేశాయి. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన వ్యక్తి. పోలీసుల విచారణలో నిందితుడు SAT Sports మరియు Future9.com పేర్లతో నిర్వహిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వెబ్సైట్ల ద్వారా ప్రజలకు వాట్సాప్‌లో లింకులు పంపించి, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. బాధితుల పేర్లపై యూజర్ ఐడీలు సృష్టించి, యూపీఐ, బ్యాంకు ఖాతాలు, క్యూ ఆర్ కోడ్ల ద్వారా డబ్బులు స్వీకరిస్తూ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుడి వద్ద నుంచి ఒక ఆపిల్ ఐఫోన్‌తో పాటు మరో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిలో SAT Sports Future9.comకు సంబంధించిన కీలక డిజిటల్ ఆధారాలు లభించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ముఠాలోని మిగిలిన నిందితులు, వారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు.


