(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 05:
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సమాలోచన అధ్యయన కేంద్రం (టాస్క్) జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
గురువారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే ఈ పోటీలలో “ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారసత్వం – నేటితరం బాధ్యత” అనే అంశంపై విద్యార్థులు వ్యాసాలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, సమాజానికి అందించిన సేవలను నేటి యువతకు పరిచయం చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.జిల్లాలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు గుర్తింపు అందజేయనున్నట్లు వెల్లడించారు.పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9492874006 నంబర్‌ను సంప్రదించాలని డాక్టర్ బాలు సూచించారు.


