-డా.సి.రోహన్ రెడ్డి
(నమస్తే ఇందూర్) కామారెడ్డి నిజామాబాద్ ప్రతినిధి ఆగస్టు 05:
ఊపిరితిత్తులు, అన్నవాహిక, మీడియాస్టినం (ఛాతీ మధ్య భాగం), డయాఫ్రేమ్, ఛాతీ గోడకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో ఆధునిక మినిమల్లీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ సి. రోహన్ రెడ్డి తెలిపారు.
బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ (వి.ఏ.టి.ఎస్.) రోబోటిక్ అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ (ఆర్.ఏ.టి.ఎస్.) వంటి అత్యాధునిక పద్ధతులతో ఛాతీ సంబంధిత శస్త్రచికిత్సలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, ఛాతీలో కణితులు వంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స మరింత సమర్థవంతంగా అందించవచ్చని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో చేసే శస్త్రచికిత్సల వల్ల చిన్న కోతతోనే ఆపరేషన్ పూర్తవుతుందని, నొప్పి తక్కువగా ఉండటంతో పాటు రోగులు త్వరగా కోలుకొని సాధారణ జీవితానికి చేరుకుంటారని వివరించారు.
థొరాసిక్ సర్జరీ అనేది గుండెను మినహాయించి ఛాతీలోని ఇతర అవయవాలకు సంబంధించిన ప్రత్యేక శస్త్రచికిత్స అని తెలిపారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఓపెన్ సర్జరీ అవసరమైనప్పటికీ, ప్రస్తుతం అత్యధిక కేసుల్లో మినిమల్లీ ఇన్వాసివ్, రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పద్ధతుల ద్వారా చుట్టుపక్కల అవయవాలకు హాని జరగకుండా అత్యంత ఖచ్చితత్వంతో చికిత్స చేయగలుగుతున్నామని వెల్లడించారు.గత పదేళ్లలో ఛాతీ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆధునిక సర్జరీ నైపుణ్యాలు, ముందస్తు నిర్ధారణ, వివిధ వైద్య విభాగాల నిపుణుల సమన్వయంతో క్యాన్సర్ రోగులకు అత్యుత్తమ వైద్యం అందుతోందన్నారు. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి తగిన ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ నాణ్యమైన, మానవీయ వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.యశోద హాస్పిటల్స్లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, హై-డెఫినిషన్ ఇమేజింగ్ సిస్టమ్స్, రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫార్మ్స్తో పాటు థొరాసిక్ సర్జన్లు, పల్మోనాలజిస్టులు, ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులు, అనస్థీషియా నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం సేవలందిస్తోందన్నారు. ప్రారంభ దశలోని ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక వ్యాధులు, ఛాతీ కణితులు, అత్యవసర ఛాతీ సమస్యల వరకు సమగ్ర చికిత్స అందిస్తున్నామని తెలిపారు.గత మూడు దశాబ్దాలుగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”గా గుర్తింపు పొందిందని, అరుదైన క్లిష్ట వైద్య ప్రక్రియలకూ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రతి వైద్య విభాగంలో సమగ్ర రోగనిర్ధారణ, చికిత్సా సేవలు అందిస్తోందని డా. రోహన్ రెడ్డి తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ మేనేజర్ రూపేష్ షిండే, మార్కెటింగ్ మేనేజర్ అమర్నాథ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


