భారీవర్షాలకు కాళోజివాడి దిగ్బంధం.. బ్రిడ్జి నిర్మాణానికి గ్రామస్తుల విజ్ఞప్తి
నమస్తే ఇందూర్, తాడ్వాయి, ఆగస్టు 4: రాత్రి కురిసిన భారీవర్షాల కారణంగా తాడ్వాయి మండలంలోని కాళోజివాడి గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు ఉప్పొంగడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లే అవకాశం లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గ్రామానికి శాశ్వత పరిష్కారంగా వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు సంబంధిత అధికారులు స్పందించి కాళోజివాడి వాగుపై వంతెన (బ్రిడ్జి) నిర్మాణానికి వెంటనే మంజూరు ఇవ్వాలని గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డి మరియు గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.


