ఉధృతంగా ప్రవహిస్తున్న లొట్టివాగు.. సర్పంచ్ పర్యవేక్షణ
లొట్టివాగు ఉగ్రరూపం.. అప్రమత్తమైన ఫరీద్‌పేట్!

భారీ వర్షాలతో ప్రమాదకర స్థాయిలో వాగు ప్రవాహం
వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించిన సర్పంచ్ నర్సింహరెడ్డి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
నమస్తే ఇందూర్ /ఫరీద్ పేట్, ఆగస్టు 8 (ప్రెస్): భారీ వర్షాల కారణంగా ఫరీద్‌పేట్ గ్రామ పరిసరాల్లోని లొట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహరెడ్డి వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వాగు ప్రవాహ ఉధృతిని పరిశీలించిన సర్పంచ్ గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా పిల్లలు, రైతులు వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో లొట్టివాగు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, గ్రామ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.


