(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5:
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూoపల్లి పల్లి గ్రామం సమీపంలో నిలిచిపోయిన 21, 22 ప్యాకేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన, పనులు మధ్యలోనే నిలిచిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించిన మహమ్మద్ తాహెర్ మాట్లాడుతూ, మంచిప్ప వరకు చేరిన 21, 22 ప్యాకేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చాలా కాలంగా నిలిచిపోవడం దురదృష్టకరమని అన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాలకు సాగునీరు అందడంతో పాటు వేలాది మంది రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆలస్యం కారణంగా రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిలిచిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ సమస్యను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తామని మహమ్మద్ తాహెర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు, మండల నాయకులు, స్థానిక రైతులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


