అధికారుల తీరుపై పలువురి ఆగ్రహం
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 19:కామారెడ్డిలో జరుగుతున్న దసరా ఉత్సవాల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పేరుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నట్లు చెబుతున్నా, అసలు ఖర్చు మొత్తం ప్రభుత్వ ఖజానా నుండే పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ తామై వ్యవహరిస్తున్న అధికారులు
దసరా ఉత్సవాల నిర్వహణ బాధ్యత పూర్తిగా ట్రస్ట్ దే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పలు శాఖల అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ అధికారులు, ట్రాన్స్ కో అధికారులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి భుజాలపై బాధ్యతలు మోస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ట్రస్ట్ సభ్యుల పాత్ర ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
అధికారుల ఖర్చుతో ఉత్సవాలా?
ఉత్సవాలు నిర్వహించేది ట్రస్ట్ అయితే, దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఖర్చు మొత్తం అధికారులే భరించడం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లైటింగ్, సౌండ్ సిస్టం, బారికేడ్లు, శుభ్రత పనులతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు మున్సిపల్, విద్యుత్ శాఖల నిధులు వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రస్ట్ పేరు చెప్పుకుని ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఒక న్యాయం.. ఉత్సవాలకు మరో న్యాయమా?
ఈ వ్యవహారంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పంట పొలాల వద్ద ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి రోజుల తరబడి విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. చిన్న ట్రాన్స్ ఫార్మర్ ఇవ్వడానికి కూడా నానా రకాల సాకులు చెబుతున్న అధికారులు, దసరా ఉత్సవాలకు మాత్రం ఏకంగా 100 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ ఫార్మర్ ను పరిమితికి మించి హుటాహుటిన ఏర్పాటు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. సామాన్య రైతుల అవసరాలను పట్టించుకోని అధికారులు, ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ వివరణ
ఈ విషయం పై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరగా లైటింగ్ , భారీగేట్స్,వాటర్ , ఇతర ఖర్చులు మున్సిపల్ పరిధిలోనే ఉంటాయని తెలిపారు


