(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 05:
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ వద్ద మహమ్మద్ అలీ షబ్బీర్ బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద క్షణాల్లో స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు ప్రజా సేవ అంటే కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాదని, ఆపదలో ఉన్న వారికి వెంటనే అండగా నిలబడటమే నిజమైన సేవ అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరోసారి నిరూపించారు.
ఆదివారం కామారెడ్డి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో బిక్నూర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన షబ్బీర్ అలీ వెంటనే తన వాహనాన్ని ఆపించారు. ప్రమాదంలో గాయపడిన వారి వద్దకు స్వయంగా వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకుని, ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌ను సమకూర్చి అత్యవసర వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని స్వయంగా పర్యవేక్షిస్తూ సమీప ఆసుపత్రికి తరలించే వరకు అక్కడే ఉండి అధికారులతో, వైద్య సిబ్బందితో సమన్వయం చేశారు. ప్రతి క్షణం విలువైనదని భావించి బాధితుల ప్రాణాలను కాపాడేందుకు వేగంగా స్పందించిన ఆయన తీరును అక్కడ ఉన్న ప్రజలు అభినందించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, “ప్రమాదంలో గాయపడిన వారికి సమయానికి వైద్యం అందితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఆపదలో ఉన్నవారిని చూసి వెళ్లిపోవడం కాదు, వారికి చేతనైన సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. మానవత్వం కంటే గొప్పది మరొకటి లేదు” అని అన్నారు.
షబ్బీర్ అలీ చూపిన మానవత్వం, వెంటనే స్పందించిన తీరు స్థానికులను కదిలించింది. ప్రజాప్రతినిధి అంటే ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలిచే వ్యక్తి అని ఆయన మరోసారి తన ఆచరణతో నిరూపించారని పలువురు ప్రశంసించారు.

