–జూలై 27న జరిగే ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
-టీడబ్ల్యూజేఎఫ్ నేతల స్పష్టీకరణ
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, జూలై 12:
కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట జూలై 13న ధర్నా నిర్వహిస్తున్నట్లు కొందరు వ్యక్తులు చేసిన ప్రకటనకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)కు ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘం జిల్లా నాయకులు స్పష్టం చేశారు. డాకూరి మోహన్ తదితరులు జర్నలిస్టు ఫెడరేషన్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలు పూర్తిగా వ్యక్తిగతమైనవేనని, వాటిని ఫెడరేషన్‌కు ఆపాదించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కృష్ణమాచారి, నాయకులు విజయానంద్, కృష్ణమూర్తి తదితరులు మాట్లాడుతూ, జర్నలిస్టు ఫెడరేషన్ ఒక రిజిస్టర్‌డ్ జర్నలిస్టు సంఘమని, ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని తెలిపారు.పలు యూనియన్లలో సభ్యులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఫెడరేషన్ పేరును అనవసరంగా ఉపయోగిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. జూలై 13న కామారెడ్డిలో జరగనున్నట్లు ప్రచారం చేస్తున్న ధర్నాకు టీడబ్ల్యూజేఎఫ్‌కు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు.అదేవిధంగా, జర్నలిస్టుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం జూలై 27న నిర్వహించనున్న “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఫెడరేషన్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జర్నలిస్టు ఫెడరేషన్ పేరును దుర్వినియోగం చేస్తూ తప్పుడు ప్రకటనలు విడుదల చేయడం బాధాకరమని, అలాంటి చర్యలతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు స్పష్టం చేశారు.

