-డయల్-100 సమాచారంతో 10 నిమిషాల్లో రైల్వే ట్రాక్‌పై గుర్తించి సురక్షితంగా రక్షణ
-వేగవంతమైన స్పందనతో మరో కుటుంబంలో విషాదాన్ని నివారించిన పోలీసు సిబ్బంది
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 20:
కామారెడ్డి జిల్లా పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన స్పందన కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు సురక్షితంగా కాపాడబడ్డాయి. ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు కేవలం పది నిమిషాల వ్యవధిలో గుర్తించి రక్షించడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
వివరాల్లోకి వెళితే, కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మానసిక ఆందోళనతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతను ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. బీసీ కానిస్టేబుల్ అరుణ్‌తో పాటు ప్రత్యేక పోలీసు బృందం అందిన సమాచారాన్ని విశ్లేషిస్తూ పలు ప్రాంతాల్లో గాలింపు నిర్వహించింది. కేవలం 10 నిమిషాల్లోనే ఆ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎలాంటి ప్రమాదం జరగకముందే అతడిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి వారికి ధైర్యం చెప్పారు.పోలీసుల సమయస్ఫూర్తి, వేగవంతమైన చర్యలు, అప్రమత్తత వల్ల ఒక విలువైన ప్రాణం నిలవడంతో పాటు ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకోకుండానివారించగలిగారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వై.ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, “ప్రతి ప్రాణం అమూల్యమైనది. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి, నిరాశ లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు సమాచారం అందిస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు” అని పేర్కొన్నారు. మానసిక ఆందోళనలు, ఒత్తిడితో బాధపడుతున్న వారు ఒంటరిగా ఉండకుండా తమ భావాలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం పొందాలని జిల్లా పోలీసులు సూచించారు. ప్రజల ప్రాణ భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.

