-ఎస్.ఐ.ఆర్. దరఖాస్తుల ఆన్లైన్ నమోదుకు ప్రత్యేక ఏర్పాట్లు
-ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ప్రధాన జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిద
(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్, జూలై 21:
ప్రజలు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్.ఐ.ఆర్.) సంబంధిత దరఖాస్తులను సులభంగా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు వీలుగా కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని మంగళవారం ప్రధాన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి పి. ముక్తిద ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఎస్ఐఆర్ దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ సహకారంతో కోర్టు ఆవరణలోనే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే చోట అవసరమైన సేవలను పొందగలరని పేర్కొన్నారు. ప్రత్యేకించి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బందితో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ కేంద్రం ద్వారా తమ దరఖాస్తులను సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.జిల్లా పరిపాలన, న్యాయవ్యవస్థ సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని, ఎస్.ఐ.ఆర్. ప్రక్రియలో పారదర్శకత, సౌలభ్యం పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం. రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

